: ఐసీసీ టెస్టు జట్టులో మనోళ్లు ఒక్కరూ లేరు... వన్డే జట్టులో షమీ ఒక్కడికే చోటు
ప్రతిభావంతులకు కొదవే లేని జట్టు టీమిండియా. డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్టు జట్టుకు అతడే ఓ విన్నింగ్ ప్లేయర్. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఘనత ఒక్క రోహిత్ శర్మకే సొంతం. ఇక శిఖర్ ధావన్, మురళీ విజయ్, అజింక్యా రెహానే... ఎవరికి వారే ప్రత్యేకత కలిగిన క్రీడాకారులు. ఇక బౌలింగ్ విషయానికొస్తే... బంతిని గింగిరాలు తిప్పుతూ ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను బోల్తా కొట్టించడంలో దిట్టగా పేరుగాంచిన చెన్నై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్ లో రెండో స్థానంలో ఉన్నాడు. బంతితోనే కాక బ్యాటుతోనూ రాణించగల సత్తా రవీంద్ర జడేజా సొంతం. ఇంతమంది సత్తా కలిగిన క్రికెటర్లున్న టీమిండియా నుంచి ఐసీసీ టెస్టు జట్టుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ఎంపిక కాలేదు. మొన్నటిదాకా ఏటా ఐసీసీ టెస్టు జట్టులో మనోళ్లకు ఒకరికంటే ఎక్కువ మందికే స్థానం దక్కేది. మహేంద్ర సింగ్ ధోనీ ఏకంగా ఐసీసీ వన్డే కెప్టెన్ గానూ ఎంపికైన సందర్భాలూ ఉన్నాయి. అయితే గతమంతా ఘనంలా తయారైంది పరిస్థితి. ఈ ఏడాదికి సంబంధించి నిన్న విడుదలైన ఐసీసీ టెస్టు జట్టులో ఒక్క భారతీయుడూ లేడు. ఇక వన్డే జట్టులోనూ బ్యాటింగ్ ఆర్డర్ లో మనకు స్థానం చిక్కలేదు. బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమీ ఒక్కడికి మాత్రం చోటు దక్కింది. ఐసీసీ టెస్టు జట్టుకు ఇంగ్లండ్ క్రికెటర్ అలిస్టర్ కుక్ కెప్టెన్ గా ఎంపిక కాగా, వన్డే జట్టుకు మాత్రం సఫారీ సంచలనం ఏబీ డివిలియర్స్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.