: బెజవాడ కమిషనర్ పై యుద్ధం ప్రకటించిన టీచర్లు... సారీ చెప్పేదాకా విధులకు రాబోమని ప్రతిన
నవ్యాంధ్ర రాజకీయ రాజధాని విజయవాడలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా నేడు సామూహిక సెలవు పెట్టి సంచలనం రేపారు. నగర మునిసిపల్ కమిషనర్ వీరపాండ్యన్ పై ఏకంగా యుద్ధమే ప్రకటించారు. నోరు జారిన కమిషనర్ సారీ చెప్పే దాకా పాఠశాలల గడప తొక్కేది లేదంటూ భీష్మించారు. నిమిషాల వ్యవధిలో మొత్తం 800 మంది ఉపాధ్యాయులు సెలవు పెట్టేశారు. కారణమేంటంటే, నగరంలోని ఓ పాఠశాలను నేటి ఉదయం సందర్శించిన సందర్భంగా కమిషనర్ వీరపాండ్యన్ అక్కడి ఉపాధ్యాయులను అసభ్య పదజాలంతో దూషించారట. ఏదో చిన్న పొరపాటు జరిగిన మాట వాస్తవమేనని, అయితే తాము పాఠాలు బోధించే పిల్లల ముందే నానా మాటలంటే విధులెలా నిర్వహించేది? అంటూ బాధిత ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతే తీవ్ర మనస్తాపానికి గురై పాఠశాలలోని మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులు సెలవు పెట్టేశారు. ఈ విషయం నిమిషాల వ్యవధిలో నగరం మొత్తం వ్యాపించింది. అంతే, బాధిత ఉపాధ్యాయులకు బాసటగా నిలిచేందుకు ముందుకు వచ్చిన నగరంలోని అన్ని పాఠశాలల టీచర్లు తామూ సెలవు పెడుతున్నట్లు ప్రకటించారు. కమిషనర్ సారీ చెప్పేదాకా విధులకు హాజరయ్యేది లేదంటూ తేల్చిచెప్పారు. ఉపాధ్యాయుల సామూహిక సెలవులతో అటు విద్యాశాఖ అధికారులతో పాటు ఇటు విద్యార్థులు అయోమయంలో పడిపోయారు.