: తమిళనాడును ఆదుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ కలసి రావాలి: వెంకయ్యనాయుడు
భారీ వర్షాలతో నీటమునిగిన తమిళనాడు పరిస్థితిపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీలో మాట్లాడారు. ఆ రాష్ట్రంలో వరద పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు రాజకీయాలకతీతంగా అందరూ కలిసి రావాలని, రాజకీయాలు, విమర్శలకు ఇది సమయం కాదని చెప్పారు. రాత్రింబవళ్లు ప్రజాసేవలో ఉన్న అధికార యంత్రాంగాన్ని నిరుత్సాహపరచేలా విమర్శలు చేయవద్దని కోరారు. రాజకీయ విభేదాలు పక్కనపెట్టి అన్ని పక్షాలు ఏకమై ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన వారికి అభినందనలు తెలిపారు. ఈ కష్టకాలంలో కేంద్రం తమిళనాడుకు అన్ని విధాలా సహకరిస్తుందని వెంకయ్య భరోసా ఇచ్చారు.