: బీఫ్ ఫెస్టివల్ కు అనుమతి నిరాకరించిన ఓయూ యాజమాన్యం
హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్శిటీలో వామపక్ష, దళిత, మైనార్టీ సంఘాలు నిర్వహించాలనుకున్న బీఫ్ ఫెస్టివల్ కు యూనివర్శిటీ అధికారులు అనుమతి నిరాకరించినట్టు విశ్వసనీయ సమాచారం. బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అడ్డుకుంటామని ఏబీవీపీ ఇప్పటికే హెచ్చరించింది. మరోవైపు, బీఫ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తే చూస్తూ ఊరుకోమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా హెచ్చరించారు. దీనికితోడు, శాంతిభద్రతలకు సంబంధించి ఇదో పెద్ద సమస్య అవుతుందని పోలీసులు కూడా భావిస్తున్నారు. అయితే, తాము ఇప్పటికే కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లకు ఆహ్వానం పంపామని నిర్వాహకులు చెప్పారు. వంద కిలోల మాంసానికి కూడా ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. ఈ క్రమంలో, ఈ నెల 10వ తేదీన ఈ ఉత్సవాన్ని ఎట్టి పరిస్థితుల్లోను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం ఉస్మానియా యూనివర్శిటీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.