: అన్నప్రాసన రోజే ఆవకాయనా?... మీడియాపై కేటీఆర్ చమత్కారం!


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడు, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) రాజకీయాల్లో రాటుదేలారు. కొత్తగా మంత్రి పదవి చేపట్టిన ఆయన సీనియర్ మంత్రులకంటే కాస్తంత వేగంగానే దూసుకుపోతున్నారు. రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో బడా పారిశ్రామిక సంస్థలను రప్పిస్తున్నారు. ఈ క్రమంలో మీడియా సంధిస్తున్న ప్రశ్నలకు కాస్తంత కటువుగానే అయినా... సూటిగా, సుతిమెత్తగా సమాధానాలిస్తూ ఆయన తనదైన శైలిలో రాణిస్తున్నారు. నిన్న కూడా మీడియాకు అలాంటి సమాధానమే చెప్పారు. బోయింగ్, టాటా ఏరో సిస్టమ్స్ అడ్వాన్స్ డ్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా తొలి ఏరో స్ట్రక్చర్ ఉత్పత్తి ప్లాంటును హైదరాబాదులో ఏర్పాటు చేయనున్నాయని కేటీఆర్ ప్రకటించారు. నిన్న జరిగిన బోయింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఆయన ఈ మేరకు ప్రకటించారు. అయితే కొందరు మీడియా ప్రతినిధులు ప్లాంట్ కు శంకుస్థాపన ఎప్పుడు, ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది? అంటూ ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానమిస్తూ కేటీఆర్ ‘‘అన్నప్రాసన రోజే ఆవకాయ అన్న చందంగా తొందరపడవద్దు. ఇప్పుడే రెండు సంస్థలు ముందుకు వచ్చాయి. ప్లాంట్ కోసం ఎంతమేర ఖర్చు పెట్టాలి? ఎప్పుడు పనులు ప్రారంభించాలని చర్చించుకుంటున్నాయి. త్వరలోనే ఈ వివరాలను ఆ కంపెనీలే వెల్లడిస్తాయి. గుడ్ న్యూస్ ను విడతలవారీగా వింటేనే బాగుంటుంది’’ అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News