: గోల్ఫర్ అవతారం ఎత్తనున్న కెప్టెన్ కూల్ ధోనీ!
కెప్టెన్ కూల్ గా క్రికెట్ వర్గాలు ముద్దుగా పిలుచుకునే టీమిండియా వన్డే, టీ20 జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఫుట్ బాల్ క్రీడ అంటే మహా ఇష్టం. సమయం చిక్కినప్పుడల్లా అతడు ఫుట్ బాల్ తో ఎంజాయ్ చేస్తుంటాడు. కొత్తగా అతడు గోల్ఫర్ అవతారం కూడా ఎత్తనున్నాడు. మరి క్రికెట్ మాటేమిటనేగా మీ డౌటు? క్రికెట్ కు అప్పుడప్పుడే వీడ్కోలు పలకడులెండి. ఇక గోల్ఫర్ గానూ ప్రొఫెషనల్ గా ఏమీ ధోనీ మారడం లేదు కూడా. దేశ రక్షణ కోసం పోరాడిన, గాయపడిన భారత, అమెరికా సైనికుల సంక్షేమార్థం నిర్వహిస్తున్న ఎగ్జిక్యూటివ్ గోల్ఫ్ ఇన్విటేషనల్ ఈవెంట్ లో మాత్రమే అతడు ఆ క్రీడ ఆడనున్నాడు. ధోనీ స్వచ్ఛంద సేవా సంస్థ ‘విన్నింగ్ వేస్’ కూడా ఈ ఈవెంట్ లో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. శనివారం నుంచి అమెరికాలో రెండు రోజుల పాటు ఈ ఈవెంట్ జరగనుంది.