: శనీశ్వరాలయంలో మందు పార్టీ... సోషల్ మీడియాలో వీడియో హల్ చల్


మొన్నటికి మొన్న 500 ఏళ్ల నాటి ఆచారానికి తిలోదకాలిస్తూ ఓ మహిళ ఔరంగాబాదులోని శనీశ్వరాలయంలోకి ఎంటరైపోయింది. స్వామి వారి పాదాలను తాకిన ఆ మహిళ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే తెరతీసింది. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు సెక్యూరిటీ గార్డులు సస్పెండ్ కాగా, ఆలయ కమిటీలోని ఓ సభ్యుడు రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా ఇదే ఆలయం నిన్న మరోమారు వార్తల్లోకెక్కింది. నిన్న ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఓ మందు పార్టీ వీడియోనే ఇందుకు కారణంగా నిలిచింది. సదరు వీడియోలో ఆలయంలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు కూర్చుని మందు పార్టీ చేసుకుంటున్నారు. ఆలయం లోపలే ఈ పార్టీ జరిగిందని ట్విట్టర్ పోస్ట్ ఆరోపిస్తుండగా, ఆలయం వెలుపల జరిగిందని ఆలయ కమిటీ వాదిస్తోంది. అయినా మూడేళ్ల క్రితం నాడు జరిగిన సదరు మందు పార్టీ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టారని కూడా ఆలయ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగనున్న ఆలయ కమిటీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ తరహా కుయుక్తులు వెలుగులోకి వస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే, మహిళ ఆలయ ప్రవేశం ఘటనకు సంబంధించి ఏడుగురు గార్డులను సస్పెండ్ చేసిన ఆలయ కమిటీ, మందు పార్టీ చేసుకున్న ముగ్గురు గార్డుల నుంచి లిఖితపూర్వక వివరణను తీసుకుని వదిలేసింది. దీనిపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News