: హామీని అమలు చేయమంటే... కాలయాపన ఎందుకు?: చంద్రబాబుకు ముద్రగడ ఘాటు లేఖ


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిన్న రెండు పేజీల ఘాటు లేఖ రాశారు. కాపులను బీసీల్లో చేరుస్తామన్న హామీని అమలు చేయమంటే కాలయాపన ఎందుకు చేస్తున్నారని ఆయన ఆ లేఖలో చంద్రబాబును నిలదీశారు. ‘‘కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ ఎన్నికల్లో మీరిచ్చిందే. దానిని అమలు చేయాలని అడుగుతుంటే నేరం ఎవరి మీదకో తోసేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య కాదా? ఎదురు దాడి చేయించడం లోకానికి తెలియదా? మా ఉద్యమం వెనుక ఎవరో ఉన్నారని మీరంటున్నారు. అంటే, గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేను చేసిన ఉద్యమాలన్నీ మీ మద్దతుతో చేసినవేనా? సీఎం గారూ, వంకర మాటలు తగ్గించండి’’ అని సదరు లేఖలో ముద్రగడ కాస్తంత ఘాటు వ్యాఖ్యలే చేశారు. కాపుల జనాభా, ఇతర వివరాలన్నీ ప్రభుత్వం వద్దే ఉన్నాయని పేర్కొన్న ముద్రగడ, కమిషన్ పేరిట చంద్రబాబు కాలయాపన చేయడానికి మొగ్గుచూపుతున్నారని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే నెల రోజుల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉందన్నారు. చంద్రబాబు నిర్ణయం కోసం నెల రోజుల పాటు వేచి చూస్తామని ప్రకటించిన ముద్రగడ, లేనిపక్షంలో వచ్చే నెల 31న తునిలో నిర్వహించనున్న కాపుల సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News