: కాంగ్రెస్ పార్టీకి ‘అసహనం’ ఎక్కువైంది... విపక్షంపై వెంకయ్యనాయుడి ఎదురుదాడి
మత అసహనంపై లోక్ సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ముప్పేట దాడిపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఎదురుదాడి చేశారు. దేశంలో అసహనం ఏమో కాని, కాంగ్రెస్ పార్టీకి మాత్రం అసహనం ఎక్కువైందని ఆయన ధ్వజమెత్తారు. దాద్రి ఘటన సహా, దేశంలో మత అసహనంపై జరిగిన చర్చకు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సవివరంగా సమాధానం చెప్పినా, వినే ఓపిక కాంగ్రెస్ పార్టీ సభ్యులకు లేకపోయిందని ఆయన ఆక్షేపించారు. ఎమర్జెన్సీని సమర్థిస్తూ కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్ శర్మ చేసిన వ్యాఖ్యలపై వెంకయ్య మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు ఆనంద్ శర్మ వ్యక్తిగతమా? లేక కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా అదేనా? అన్న విషయాన్ని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆరోపణలు గుప్పించే నైజం అలవాటుగా మారిందని వెంకయ్యనాయుడు ధ్వజమెత్తారు.