: ‘వర్ల’కు హౌసింగ్, జూపూడికి ఎస్సీ కార్పొరేషన్... ఏపీలో ‘నామినేటెడ్’ భర్తీకి రంగం సిద్ధం


ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం దాదాపుగా సిద్ధమైనట్లు సమాచారం. దాదాపు పదేళ్ల తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులపైనా తెలుగు తమ్ముళ్లు గంపెడాశలు పెట్టుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కనీసం రాజధాని కూడా లేకుండా ఓ ముక్కగా మిగిలిన రాష్ట్రంలో పరిపాలనను దారిలో పెట్టేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు చాలా కాలమే పట్టింది. ఇటీవలే పార్టీ పదవుల భర్తీని పూర్తి చేసిన ఆయన తాజాగా నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి జాబితాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు చంద్రబాబు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. ఇక వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్న దళిత నేత, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ కు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కనుంది. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో సత్తా చాటుతున్న పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధను మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ పదవి వరించనుంది. ఇక, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా జయరామిరెడ్ది, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా ఎల్వీఎస్సార్కే ప్రసాద్, కాపు కార్పొరేషన్ చైర్మన్ గా చలమలశెట్టి రామాంజనేయులు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా లింగారెడ్డి పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. ఖాళీగా ఉన్న కార్పొరేషన్ల చైర్మన్ పదవులకు కూడా చంద్రబాబు సరైన నేతలనే ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నేడో, రేపో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News