: 'హెచ్ఐవీ సర్టిఫికెట్' ఉంటేనే...ఇంటిలోకి ఎంట్రీ!: యూపీ గ్రామంలో భర్తలకు షాకిస్తున్న భార్యలు


ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాకు చెందిన ఉదయ్ సరాయ్ ఓ చిన్న కుగ్రామం. 200 గడపలున్న ఆ చిన్న గ్రామంలో మగాళ్లంతా జీవనోపాధి కోసం ముంబై బాట పడుతున్నారు. ఏడాదంతా అక్కడే పనిచేస్తున్నారు. గ్రామానికి చెందిన దాదాపు 250 మంది దాకా పురుషులు ప్రస్తుతం ముంబైలోనే పనిచేస్తున్నారు. ఏళ్ల నాటి నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ తరహా జీవన విధానంలో ఏడాదికి ఒక్కసారే వారంతా తమ గ్రామంలోని కుటుంబాల వద్దకు వస్తారు. వచ్చేటప్పుడు అప్పటిదాకా పోగేసిన డబ్బుతో పాటు పిల్లలకు టపాసులు, స్వీట్లు పట్టుకుని వస్తారు. ఇలా ముంబైలో ఏడాదంతా పనిచేసిన వీరంతా ఒకేసారి గ్రామానికి వస్తుండటంతో ఏటా దీపావళి పర్వదినాన ఆ ఊర్లో అంతా సందడి వాతావరణం నెలకొంటోంది. అయితే ఈ ఏడాది మాత్రం ఓ వింత చోటుచేసుకుంది. ముంబై నుంచి వచ్చిన ప్రతి పురుషుడిని అతడి భార్య హెచ్ఐవీ సర్టిఫికెట్ కోసం నిలదీసిందట. హెచ్ఐవీ సర్టిఫికెట్ తీసుకొచ్చేదాకా పడక సుఖం లేదని తేల్చి చెప్పేశారట. దీంతో కంగుతిన్న భర్తలు... ఏడాదంతా కుటుంబం కోసం ఊరు కాని ఊరులో రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి వస్తే, ఇలాగేనా ఆహ్వానించేది? అని లోలోపలే మదనపడుతున్నారట. అసలు ఈ సర్టిఫికెట్లను భార్యామణులు అడగడానికి కారణమూ ఉందిలెండి. జీవనోపాధి కోసం ముంబై వెళ్లి డబ్బు, దస్కంతో వస్తున్న కొందరు పురుషులు ప్రాణాంతక హెచ్ఐవీని కూడా తమ వెంట తీసుకువస్తున్నారట. ఈ విషయంపై గ్రామ పెద్దలతో కలిసి మహిళలంతా సుదీర్ఘ చర్చలు జరిపి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారట. ఈ తరహా నిర్ణయం తీసుకోకపోతే, సమీప భవిష్యత్తులో గ్రామంలోని అందరికీ ఈ వ్యాధి అంటుకుంటుందన్న భయమే వారిని ఈ దిశగా అడుగులు వేయించిందట.

  • Loading...

More Telugu News