: లోక్ సభలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ
ఎన్డీఏ ప్రభుత్వంపై లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. అసహనంపై చర్చ సందర్భంగా ఆయన ఉద్రేకపూరితంగా మాట్లాడారు. ప్రజల మాటలను ప్రధాని మోదీ వినడం లేదని విమర్శించారు. రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న ప్రధాని మోదీకి రాజ్యాంగం పట్ల గౌరవం ఉందా? అని ప్రశ్నించారు. మహాత్మాగాంధీని పొగిడిన ప్రధాని... గాడ్సేను దేశభక్తుడన్న సాక్షి మహరాజ్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదని విమర్శించారు. కేవలం ముస్లిం అయినందువల్లే అఖ్లాక్ ను హత్య చేశారని... ఆయన కుమారుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తూ దేశానికి సేవ చేస్తున్నారని... ఇందులో బాధాకరమైన అంశమేంటంటే, ఈ ఘటనపై ప్రధాని మోదీ ఇంతవరకు స్పందించకపోవడమని విమర్శించారు. మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతోందని మండిపడ్డారు. తన హయాంలో గుజరాత్ అభివృద్ధి చెందిందని, అలాగే దేశం మొత్తానికి మంచి రోజులు వస్తాయని గతంలో మోదీ చెప్పారని... ఇప్పుడు అదే గుజరాత్ లో పటిదార్ ఆందోళన చెలరేగిందని ఎద్దేవా చేశారు. ఇదేనా గుజరాత్ అభివృద్? అని రాహుల్ ప్రశ్నించారు. సామాన్యుల గొంతు నొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని అన్నారు. అసహనానికి వ్యతిరేకంగా మేధావులు తమ అభిప్రాయాలను వెల్లడించారని, అవార్డులు వెనక్కి ఇచ్చేశారని చెప్పారు. సహనంతో మెలిగితేనే భారత్ తన గొప్పదనాన్ని నిలుపుకుంటుందని అన్నారు. పాకిస్థాన్ ఫెయిల్ కావడానికి కారణం అక్కడ నెలకొన్న అసహనమే అని చెప్పారు. పాక్ పాలకులు అక్కడి ప్రజల గొంతులను నొక్కేస్తుంటారని... అలాంటి పరిస్థితి మన దేశంలో రాకూడదని సూచించారు. హర్యాణాలో దళిత పిల్లలను తగలబెడితే, కేంద్ర మంత్రి ఒకరు వారిని కుక్కలతో పోల్చారని మండిపడ్డారు.