: ఆ ఇద్దరు 'సార్లు' మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు: షీ టీమ్ కు విద్యార్థినుల ఫిర్యాదు
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ గురువులు బాధ్యత మరచి, నానా ఇబ్బందులు పెడుతుండటంతో స్కూల్లోని విద్యార్థినులు సహించలేకపోయారు. ఏకంగా విద్యాశాఖ అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడమే కాక, షీ టీమ్ కు కూడా ఫిర్యాదు ఇచ్చారు. దీంతో ఆ ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు ఈ ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ తమను పలు విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, నిత్యం తమపై దుర్భాషలాడుతుంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మగపిల్లల పక్కన కూర్చోబెడుతున్నారని... తాము అడిగితే 'వాడేమీ చేయడులే' అంటారని తెలిపారు. అలాగే చెంపపై కొడతారని చెప్పారు. ఈ పాఠశాలతో తాము చదవలేమని, తమకు టీసీలు ఇచ్చి వేరే స్కూల్లో చేర్పించాలని విద్యాశాఖ అధికారికి విన్నవించారు.