: ‘కఠారి’ హత్యతో నాకు సంబంధం లేదు!... కోర్టులో చింటూ వాదన
చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ లను హత్య చేశాడని చెబుతున్న కఠారి మేనల్లుడు చింటూ రాయల్ అలియాస్ శ్రీరామ చంద్రశేఖర్ నిన్న కోర్టులో వితండ వాదన చేశాడు. జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ మీడియా సమావేశంలో ఉన్న సమయాన్ని చూసుకుని కోర్టు ప్రాంగణంలోకి ఎంటరైన చింటూ, నేరుగా నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి హాలుకు వెళ్లాడు. గదిలోకి ఎంటరైన వెంటనే అతడు న్యాయమూర్తికి ఓ పిటిషన్ అందజేశాడు. కఠారి మోహన్, ఆయన సతీమణి అనురాధల హత్య కేసులో తనకేమాత్రం ప్రమేయం లేదని ఆ పిటిషన్ లో చింటూ పేర్కొన్నాడు. అయితే, అప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి ఉన్న నేపథ్యంలో చింటూకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి 15 రోజుల పాటు చింటూను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.