: బాసు వేధింపులతో అటెండర్ ఆత్మహత్యాయత్నం... తిరుపతిలో కలకలం రేపిన ఘటన
తిరుపతిలో నేటి ఉదయం జరిగిన ఓ ఘటన కలకలం రేపుతోంది. నగరంలోని రాష్ట్ర సమాచార కేంద్రంలో అటెండర్ గా పనిచేస్తున్న రాంప్రసాద్ అనే ప్రభుత్వ ఉద్యోగి ఉన్నతాధికారి వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్ బాటిల్ తో నేటి ఉదయం కార్యాలయానికి చేరుకున్న రాంప్రసాద్ గేటు ముందు తనపై పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకునే యత్నం చేశాడు. అయితే అప్పటికే అతడి యత్నాన్ని గమనించిన తోటి ఉద్యోగులు రాంప్రసాద్ ను అడ్డుకున్నారు. కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఓ అధికారి వేధింపులు తాళలేకనే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధితుడు తెలిపాడు. ప్రభుత్వ కార్యాలయంలోనే చోటుచేసుకున్న ఈ ఘటన పెను కలకలం రేపుతోంది. దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు సమాచార శాఖ ఆర్జేడీ దర్యాప్తు చేస్తున్నారు.