: సలీం తన ఆరోపణలను నిరూపించాలి, లేదా క్షమాపణ చెప్పాలి: రాజ్ నాథ్
భారతదేశంలో 800 సంవత్సరాల తర్వాత హిందూ రాజ్యం వచ్చిందంటూ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారని సీపీఎం ఎంపీ మహ్మద్ సలీం చేసిన వ్యాఖ్యలు లోక్ సభలో గందరగోళానికి తెరలేపాయి. సలీం వ్యాఖ్యల పట్ల బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ మాట్లాడుతూ, తానెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. తాను ఆ వ్యాఖ్యలను ఎక్కడ చేశానో సలీం చెప్పాలని అన్నారు. సలీం చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచి వేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. హోం మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సమాజం హర్షించదని చెప్పారు. తనపై చేసిన ఆరోపణలను సలీం నిరూపించాలని లేదా క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.