: మత అసహనమే ఉంటే అమీర్ ఖాన్, కిరణ్ ఎలా కలిశారు?: ప్రశ్నించిన రాందేవ్
ఇండియాలో మత అసహనం అన్న పదమే లేదని, భారతీయులు ఎంతో సహనశీలురని యోగా గురువు రాందేవ్ బాబా వ్యాఖ్యానించారు. మత అసహనం అన్న పదాన్ని విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం సృష్టించినదేనని అభిప్రాయపడ్డ ఆయన, అసహనం ఉంటే, అమీర్ ఖాన్, కిరణ్ రావులు ఎలా కలిశారని, వారి వివాహం జరిగి వుండేదా? అని ప్రశ్నించారు. కిరణ్ కు భయమే ఉంటే, అమీర్ ను పెళ్లాడేది కాదని వ్యాఖ్యానించారు. మోదీ వచ్చిన తరువాత దేశంలో నల్లధనం పెరిగిందని, అయితే, నల్లధనాన్ని వెనక్కు తెచ్చేందుకు శ్రమిస్తున్న ఆయనకు మరింత సమయం ఇవ్వాల్సి వుందని రాందేవ్ అన్నారు. బ్లాక్ మనీపై మాట్లాడే సమయం పోయిందని, చేతల్లో చూపించాల్సిన సమయం వచ్చిందని వివరించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు తప్పుబట్టాల్సిన అవసరం లేదని, సమయం వస్తే, తాను కూడా పోరాడతానని అన్నారు.