: భారతీయుల కోసమే తయారైన యాప్స్!


ఇండియాలోని స్మార్ట్ ఫోన్ వాడకందారుల కోసం 30 లక్షలకు పైగా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో అత్యధికం భారతీయులకు ఏ మాత్రం ఉపయోగపడనివే. అయితే, వీటిల్లోనే జీవితాన్ని మరింత సుగమం, సౌలభ్యం చేసే యాప్స్ కూడా ఉన్నాయి. ఎటొచ్చీ వీటిని ఎంచుకోవడంలోనే తెలివిని చూపాలి. అటువంటి వాటిల్లో భారతీయుల కోసమే తయారైన యాప్స్ లో కొన్నింటి వివరాలివి. ట్రూ మెసింజర్: మీ ఈ-మెయిల్ కు వచ్చే జంక్ మెయిల్స్, స్పామ్ మెయిల్స్ ను ఎలా అడ్డుకోగలమో... అలాంటి సౌకర్యమే మొబైల్ లోనూ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారా? మీ కోసమే వచ్చింది ట్రూ మెసింజర్. జంక్ మెసేజ్ లను ఈ యాప్ బ్లాక్ చేస్తుంది. కొన్ని రకాల మెసేజ్ లను గుర్తించి వాటిని స్పామ్ బాక్స్ లోకి పంపుతుంది. మీరు ఏదైనా నంబర్ నుంచి వచ్చిన మెసేజ్ ని స్పామ్ గా గుర్తిస్తే, తదుపరి ఆ నంబర్ నుంచి వచ్చే సమాచారాన్ని స్పామ్ కు పంపుతుంది. ఎంతో ఫేమస్ అయిన ట్రూ కాలర్ యాప్ ను తయారు చేసిన టీమే దీన్ని కూడా తయారు చేసింది. స్మార్ట్ స్పెండ్స్: నిత్యమూ ఎంత ఖర్చవుతోంది? నెలకు ఎంత మిగులుతోంది? ఆదాయం ఎంత? ఖర్చెంత? వంటి విషయాలకు పెన్ను, కాగితాలు పట్టుకుని శ్రమించాల్సిన అవసరం లేకుండా చేస్తుంది ఈ స్మార్ట్ స్పెండ్స్ యాప్. మీరు అందించే ఖర్చు సమాచారాన్ని విశ్లేషిస్తూ, విజువల్ చార్టులు, సులువుగా చదువుకునేలా ఎకౌంట్లను మేనేజ్ చేస్తుంది. హాప్టిక్: మీకూ ఓ పర్సనల్ సెక్రటరీ కావాలా? ఓ వ్యక్తిగత కార్యదర్శి చేసే పనులన్నీ ఈ హాప్టిక్ యాప్ చేసి పెడుతుంది. మీకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది. హైదరాబాద్ నుంచి ఏడుపాయల వెళ్లాలన్నా, ఇంట్లో పాడైపోయిన ఫ్రిజ్ ను మరమ్మతు చేసే వ్యక్తి దగ్గర్లో ఎక్కడున్నాడన్న వివరాలు అందిస్తుంది. నిమిషాల వ్యవధిలో సమాచారం ఇచ్చేందుకు హాప్టిక్ టీం భారీ స్థాయిలోనే వనరులను సమకూర్చి పెట్టుకుంది. టాక్సీ: ఓలా, మేరూ, ఉబెర్, డయల్ ఏ టాక్సీ... ఇలా ఎన్నో రకాల క్యాబ్ సేవల సంస్థలు పుట్టుకొచ్చిన వేళ, అన్నింటి సేవలనూ ఒకే చోట అందించేలా తయారైన యాప్ టాక్సీ. దేశవ్యాప్తంగా 52 నగరాల్లో అందుబాటులో ఉంది. పిన్ కోడ్: మీకు ఏదైనా గ్రామం పిన్ కోడ్ కావాలా? లేక మరేదైనా బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్ కావాలా? ప్రముఖ కంపెనీల టోల్ ఫ్రీ సంఖ్యలు, ప్రభుత్వ కార్యాలయాల చిరునామాలు, విమానయాన సంస్థల ఫోన్ నంబర్లు, రైల్వే పీఎన్ఆర్ స్టాటస్ వంటి ఎన్నో సేవలను పిన్ కోడ్ అందిస్తోంది. ఇదే పేరిట గూగుల్ ప్లే స్టోర్ లో పలు యాప్స్ ఉన్నాయి. ఇండియా నేటివిటీకి తగ్గట్టుగా తయారైన ఈ యాప్ కావాలంటే, "Pincode STD IFSC PNR FM Search" అని సెర్చ్ చేయాల్సి వుంటుంది సుమా! హెల్దిఫై మీ: మీరు మ్యారీ బిస్కెట్లు తిన్నా, లిప్టన్ టీ తాగినా, ఇడ్లీ లాగించినా, ఫ్రైడ్ రైస్, సమోసా వంటి ఆహారం తీసుకున్నా... మీ శరీరంలో ఎన్ని కేలరీలు ఉన్నాయి. వాటిని తగ్గించుకునేందుకు ఏం చేయాలన్న విషయాన్ని ఎప్పటికప్పుడు చెబుతుంది ఈ యాప్. ఏం ఎక్సర్ సైజులు చేయాలి? ఆరోగ్యానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలన్న వివరాలూ తెలియజేస్తుంది.

  • Loading...

More Telugu News