: చెక్ బౌన్స్ కేసులో సినీనటి జీవితకు ఊరట
ప్రముఖ సినీ నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ కు చెక్ బౌన్స్ కేసులో ఊరట లభించింది. ఆమెపై ఉన్న కేసును హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు కొట్టి వేసింది. ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ, తనపై ఉన్న కేసుకు కోర్టు కొట్టి వేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అనవసరంగా తనను కోర్టుకు లాగి, తన ప్రతిష్టకు భంగం కలిగించిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. కావాలనే తన వద్ద నుంచి చెక్ లు తీసుకుని, కేసులో ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు వివరాల్లోకి వెళ్తే, 2007లో 'ఎవడైతే నాకేంటి' సినిమా నిర్మాణం సందర్భంగా సామ చంద్రశేఖర్ రెడ్డి వద్ద నుంచి జీవిత రుణం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఆమె ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. ఈ కేసుకు సంబంధించి 2014లో జీవితకు రూ. 25 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్షను విధిస్తూ ఎర్రమంజిల్ కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు విధించిన జరిమానాను జీవిత వెంటనే కట్టేసి, బెయిల్ పిటిషన్ వేశారు. వెంటనే కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా, జీవితకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఎర్రమంజిల్ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తామని చెప్పారు.