: ఢిల్లీ ఎమ్మెల్యేల వేతనాలు భారీగా పెరిగాయి... జంగ్ సంతకమే తరువాయి!
ఢిల్లీ అసెంబ్లీకి ఎమ్మెల్యుగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల వేతనాలు ఒకేసారి రెండున్నర రెట్లు పెరిగాయి. నిన్నటిదాకా నెలకు రూ.88 వేలు అందుకుంటున్న ఢిల్లీ ఎమ్మెల్యేలు ఇకపై నెలకు రూ.2.10 లక్షల వేతనాన్ని అందుకోనున్నారు. ఈ మేరకు నిన్న అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్ వేతన పెంపు ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని సగటు వ్యయానికంటే ఎమ్మెల్యేల వేతనాలు బాగా తక్కువగా ఉన్నాయని భావించిన ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం లోక్ సభ్ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించి వేతన సవరణపై అధ్యయనం చేయించింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అప్పటిదాకా అందుతున్న వేతనాన్ని రెండున్నర రెట్లు పెంచాలని ఆచారి కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫారసుకు ఆమోదం తెలిపిన కేజ్రీ కేబినెట్ తుది అనుమతి కోసం లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కు ఫైలును పంపించింది. జంగ్ సంతకం పడగానే మొత్తం 70 మంది ఎమ్మెల్యేల వేతనాలు పెరగనున్నాయి.