: అమీర్ వ్యాఖ్యలతో విభేదాలు... భర్తతో గొడవపడి భార్య ఆత్మహత్య!
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన ‘అసహనం’ వ్యాఖ్యలపై చర్చించుకున్న భార్యాభర్తల మధ్య మాటా మాటా పెరిగి... చివరకు భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన భోపాల్ లో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... జబల్ పూర్ లోని కొత్వాలి ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువతి సోనమ్ పాండే. ఆమె భర్త మయాంక్ పాండే. ఒక ఎన్జీవో (స్వచ్చంద సంస్థ)లో అతను పనిచేస్తాడు. అమీర్ చేసిన వ్యాఖ్యల అంశంపై బుధవారం రాత్రి భార్యాభర్తలు చర్చించుకున్నారు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వాదులాడుకున్నారు. ఆ తర్వాత సోనమ్ పాండే పాయిజన్ తీసుకుంది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై సోనమ్ మామ, రిటైర్డ్ వెటర్నరీ సర్జన్ ఆర్పీ పాండే మాట్లాడుతూ, తన కోడలు అమీర్ ఖాన్ అభిమాని అని, అమీర్ వ్యాఖ్యలపై ఆమె భర్త మయాంక్ హాస్య పూరిత విమర్శలు చేయడంతో సోనమ్ తట్టుకోలేకపోయిందని అన్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా కొత్వాలి పోలీస్ స్టేషన్ విచారణాధికారి ఒ.పి సింగ్ మాట్లాడుతూ, సోనమ్ పాండే భర్త ఫిర్యాదును అనుసరించి ప్రస్తుతం తాము దర్యాప్తు నిర్వహిస్తున్నామన్నారు. ఆ తర్వాత తమ కోణంలో దర్యాప్తు చేస్తామన్నారు. సంఘటనా స్థలంలో పాయిజన్ శాంపిల్స్ ని సేకరించామన్నారు. కాగా, సోనమ్ భర్త ఆమెను కట్నం కోసం వేధించేవాడని మృతురాలి సోదరుడు ఆరోపణలు చేశాడని, ఈ విషయమై కూడా దర్యాప్తు చేస్తామని ఆ అధికారి పేర్కొన్నారు.