: పారిస్ ఉగ్రదాడి వెనుక 'భారత' మూలాలు... దర్యాప్తు చేస్తున్న ఐబీ!
ఇటీవల పారిస్ పై జరిగిన ఉగ్రవాదుల దాడితో పాటు ఆఫ్రికాలోని అల్ మెరా బిట్నర్ హోటలుపై జరిగిన దాడి వెనుక భారత మూలాలు ఉన్నాయా? అక్కడ దాడులకు పాల్పడిన ముష్కరులకు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు సహకరించారన్న అనుమానాలతో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు విచారణ జరుపుతున్నట్టు సమాచారం. కొంతకాలం క్రితం ఆదిలాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేసిన ఓ ఉగ్ర సానుభూతి పరుడిని విచారించగా, ఈ విషయం వెల్లడైనట్టు తెలుస్తోంది. సెప్టెంబరులో దుబాయ్ నుంచి వచ్చిన నిక్కీ జోసెఫ్ అలియాస్ అప్షా జుబేన్ ను విచారించిన భద్రతా దళాలు, ఆమె నుంచి పలువురు యువకుల సమాచారాన్ని సేకరించి, వారిని గుర్తించి అదుపులోకి తీసుకునే పనిలో ఉన్నారు. కాగా, పారిస్ దాడుల్లో పాల్గొన్న 23 మందిలో కొందరు ముంబైకి వచ్చారని నిఘా వర్గాలకు సమాచారం అందడంతో, ఈ దిశగా ఐబీ, పోలీసు వర్గాలు విచారణ ముమ్మరం చేశాయి. ముంబై విమానాశ్రయానికి వచ్చిన వారందరి జాబితాలనూ పరిశీలించే పనిలో నిమగ్నమయ్యాయి.