: ఓటుకు నోటు కేసులో కీలక మలుపు... ఆడియో టేపుల్లోని వాయిస్ రేవంత్, సండ్రలవేనని నిర్ధారణ
తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టిన ఓటుకు నోటు కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ ఓటును కొనుగోలు చేసేందుకు టీ టీడీపీ యత్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టీఫెన్ సన్ కు రూ.50 లక్షలు ముట్టజెబుతూ తెలంగాణ అసెంబ్లీలో టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా బుక్కయ్యారు. స్టీఫెన్ సన్ ఇంటిలోనే రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తెలంగాణ ఏసీబీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత టీ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కూడా ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోర్టు నుంచి బెయిల్ పొందిన వీరిద్దరూ బయటే ఉన్నారు. ఈ క్రమంలో సాక్ష్యాలుగా సేకరించిన ఆడియో టేపుల్లోని వాయిస్ లను నిర్ధారించుకునేందుకు వాటిని ఏసీబీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి పంపింది. వీటిపై సుదీర్ఘంగా పరిశీలన జరిపిన ఫోరెన్సిక్ నిపుణులు నిన్న తమ నివేదికను ఏసీబీ అధికారులకు అందజేశారు. ఆడియో టేపుల్లోని వాయిస్ లు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన జెరూసలెం మత్తయ్యలవేనని తేలినట్లు సమాచారం. ఇక వీడియో టేపులను కూడా పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు వాటిలోని వాయిస్ లు కూడా నిందితులవేనని నిర్ధారించినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో కీలక సాక్ష్యాలుగా పరిగణిస్తున్న ఆడియో, వీడియో టేపుల విశ్లేషణ పూర్తయిన నేపథ్యంలో ఈ కేసులో అదనపు చార్జీ షీట్ దాఖలుకు ఏసీబీ సమాయత్తమవుతున్నట్లు సమాచారం.