: ‘సాక్షి’ పత్రికను చదవొద్దు!... ప్రజలకు చంద్రబాబు సూచన
వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన ‘సాక్షి’ పత్రికను చదవొద్దని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రజలకు సూచించారు. నిన్న విజయవాడలో ఇసుక విధానంపై శ్వేత పత్రం విడుదల కోసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా ఆయన ‘సాక్షి’ పత్రికను ప్రస్తావించారు. ‘‘అవినీతి సొమ్ముతో పెట్టిన ఆ పత్రిక అసత్య కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తోంది. ఆ పత్రికను చదివితే అయోమయమే తప్ప వాస్తవాలు తెలియవు. దాన్ని చదివి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడమే అవుతుంది. దానికి బదులు చదవకుండా ఉండటం మేలు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజకీయాలతో సంబంధం లేని పత్రికలను చదవాలని ఆయన ప్రజలకు సూచించారు. ‘‘ఆ పత్రికేదో స్వర్గంలో పుట్టినట్లు సిగ్గులేని రాతలు రాస్తోంది. దాని యజమాని వారానికోసారి కోర్టుకు వెళుతున్నాడు కూడా" అంటూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.