: ఇళయరాజా సోదరుడికి కళల విభాగం ప్యాట్రన్ పదవి
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ కు, కేంద్ర మాజీమంత్రి డి.నెపోలియన్ కు తమిళనాడు బీజేపీ శాఖలో పదవులు లభించాయి. కళల విభాగం ప్యాట్రన్ గా గంగై అమరన్ ను, రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిలో నెపోలియన్ ను నియమించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ పేర్కొన్నారు. వీరికే కాక, తమిళ సినీ రంగం నుంచి మరి కొందరికి కూడా పదవులు లభించాయి. తమిళ దర్శకుడు కస్తూరి రాజాకు రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక సభ్యత్వంతో పాటు కళల విభాగానికి ఉపాధ్యక్ష పదవి కూడా లభించింది. ఆ విభాగానికి కార్యదర్శిగా నటి గాయత్రీ రఘురామ్ నియమితులయ్యారు. పార్టీ ప్రచార విభాగం ఉపాధ్యక్షురాలిగా నటి, నిర్మాత కుట్టి పద్మినిని నియమించారు. ఎన్నికల విభాగానికి అధ్యక్షుడిగా అన్నాడీఎంకే మాజీ ఎంపీ ఎస్.మలైసామిని నియమించారు. కాగా, గత ఏడాది డిసెంబర్ లో డీఎంకే పార్టీని వీడిన గంగై అమరన్, నెపోలియన్ లు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.