: యూఎస్ నగరాన్ని చుట్టుముట్టిన కోట్లాది 'స్పైడర్'లు... హారర్ సినిమా చూపించేశాయి!


సాలెపురుగులు... ఒకటి, రెండూ కనిపిస్తే పట్టించుకోం. అదే వాటి సంఖ్య వందలూ, వేలూ దాటి కోట్లకు చేరి, అన్నీ ఒకే చోట కనిపిస్తే... ఎంత భయంకరం? అమెరికాలోని తెన్నెస్సీ రాష్ట్ర పరిధిలోని నార్త్ మెంఫిస్ నగర వాసులు ఆ భయాన్ని రుచి చూశారు. నగరాన్ని కోట్లాది సంఖ్యలో స్పైడర్ లు చుట్టుముట్టగా, వేలాది మంది ఊరు ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి. దాదాపు కిలోమీటరు పొడవైన సాలెగూడును ఈ ఎనిమిది కాళ్ల పురుగులు గంటల వ్యవధిలో నిర్మించుకోగా, మెంఫిస్ వాసులకు హారర్ సినిమా కళ్లముందు కనిపించినట్లయింది. "నిన్న నా కారులో ఎక్కడ చూసినా సాలీళ్లే. ఎంతో భయం వేసింది" అని నార్త్ మెంఫిస్ నివాసి ఇదా మోరిస్ వ్యాఖ్యానించారు. "గాలిలో, నేలపై, ఇళ్లల్లో ఎక్కడ చూసినా స్పైడర్లు కనిపించాయి" అని డెబ్రా లూయిస్ అనే వ్యక్తి సీఎన్ఎన్ కు వెల్లడించాడు. అయితే, ఇలా సాలీళ్లు ఒక్కసారిగా బయటకు రావడం వల్ల ప్రమాదమేమీ లేదని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇవన్నీ క్షేమంగా తిరిగి వెళ్లేందుకు చర్యలు చేపట్టినట్టు మెంఫిస్ జూ క్యూరేటర్ స్టీవ్ రిచెలింగ్ వెల్లడించారు. ఇక సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా స్పైడర్లపై చర్చే. వీటి కదలికలను గమనించే యాప్ ను ఎవరైనా గుర్తించారా? అని ఒకరు అడిగితే, యూఎస్ లో ఇవి మామూలేనని మరొకరు వ్యాఖ్యానించారు. కాగా, గత నెలలో వేలాది స్పైడర్ లు ఓహియో బ్రిడ్జిని చుట్టుముట్టగా, గత సంవత్సరంలో మిస్సోరీలోని ఓ గృహంపై సాలీళ్ల సైన్యం దాడి జరిపింది.

  • Loading...

More Telugu News