: పాతికేళ్ల తర్వాత సొంత గూటికి ఆనం బ్రదర్స్... పోస్టులు కూడా ఖరారు!
ఆనం బ్రదర్స్... నెల్లూరు రాజకీయాల్లో పేరొందిన నేతలు. వివాదాస్పద ప్రకటనలకే కాక ముక్కుసూటిగా మాట్లాడే సీనియర్ ఆనం... వివేకానందరెడ్డి నిత్యం వార్తల్లో ఉంటే, సౌమ్యుడైన జూనియర్ ఆనం.. రాంనారాయణరెడ్డి చడీచప్పుడు లేకుండా పనులు చక్కబెడతారన్న పేరుంది. నందమూరి తారకరామారావు తెలుగు దేశం పార్టీని ఆవిష్కరించిన సందర్భంగా ఆ పార్టీలో వీరు చేరిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకే అక్కడ పడక, పార్టీ మారి గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో చేరిపోయారు. దాదాపు 25 ఏళ్ల పాటు వారు కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వస్తున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జూనియర్ ఆనం ఆయన కేబినెట్ లో కీలక భూమిక పోషించారు. వైఎస్ అకాల మరణం తర్వాత రోశయ్య కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆ తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లోనూ అదే పదవిలో కొనసాగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోగా, ఆనం బ్రదర్స్ కు కూడా ఓటమి తప్పలేదు. దీంతో పార్టీ కార్యక్రమాలకు కూడా దూరమైన ఆనం బ్రదర్స్ తిరిగి సొంత గూటికి చేరేందుకు నిర్ణయించుకున్నారు. వీరి చేరికకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సూత్రప్రాయంగా అంగీకరించడమే కాక వారికిచ్చే పార్టీ పదవులను కూడా ఖరారు చేశారని సమాచారం. జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ చార్జీ బాధ్యతలు జూనియర్ ఆనంకు, నెల్లూరు రూరల్ ఇన్ చార్జీ బాధ్యతలు సీనియర్ ఆనం కొడుకుకు దక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది.