: జాతీయ భద్రతా చట్టం కింద ‘నిర్భయ’ బాల నేరస్తుడి శిక్ష పొడిగింపు?
మూడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీ లో ఇరవై మూడేళ్ల యువతి జ్యోతి సింగ్ పాండే (నిర్భయ)పై జరిగిన దారుణం భారత ప్రతిష్టకు ప్రపంచ స్థాయిలో మచ్చ తెచ్చింది. ఈ దారుణానికి పాల్పడ్డ వారిలో రామ్ సింగ్, ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్ లతో పాటు ఒక బాల నేరస్తుడు కూడా ఉన్నాడు. నిర్భయ కేసుగా పిలుస్తున్న ఈ గ్యాంగ్ రేప్, హత్య సంఘటనలో బాల నేరస్తుడు రిమాండ్ హోమ్ నుంచి సుమారు ఒక నెలలో బయటకు రానున్నాడు. జువైనల్ గా మూడు సంవత్సరాల శిక్షా కాలం ముగియడంతో వచ్చే డిసెంబర్ లో అతన్ని విడుదల చేయనున్నారు. ఇప్పుడతని వయసు 21 సంవత్సరాలు. అయితే, ఈ కుర్రాడిని సమాజంలోకి వదలకుండా, జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అతనిపై కేసు నమోదు చేసే ప్రయత్నాల్లో ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారులు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీనియరు న్యాయవాదులను వారు కలిశారు. వారి అభిప్రాయాలతో పాటు సలహాలు, సూచనలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్ఎస్ఏ ప్రకారం కేసు బుక్ చేస్తే మరో ఏడాది పాటు జైలు తప్పదు. కాగా, ‘నిర్భయ’ కేసులో బాల నేరస్తుడు విడుదల కాకుండా ఉండేందుకని గ్యాంగ్ రేప్ బాధితురాలి తల్లిదండ్రులు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్.హెచ్.ఆర్.సీ) ని ఆశ్రయించారు. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని అధికారులకు సమర్పించారు. ‘మా కూతురిపై దారుణానికి ఒడిగట్టిన దోషులందరిలోకి ఈ బాల నేరస్తుడు చాలా కిరాతకుడు. అతని శిక్షా కాలం ముగియనుండటంతో వచ్చే డిసెంబర్ లో విడుదల చేయనున్నారు. ప్రజల జీవితానికి, స్వేచ్ఛ కు ఇటువంటి వాడు ప్రమాదకారి’ అంటూ ఆ వినతిపత్రంలో జ్యోతి సింగ్ పాండే తల్లిదండ్రులు పేర్కొన్నారు.