: రింగు రోడ్డుపై కన్నీరుమున్నీరైన పేర్వారం సతీమణి... మనవల డెడ్ బాడీస్ చూసి తట్టుకోలేకపోయిన వైనం
హైదరాబాదు ఔటర్ రింగు రోడ్డుపై నేటి తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పేర్వారం రాములు మనవలు వరుణ్, అమిత్ లు మృత్యువాత పడిన ఘటన పలువురిని కంటతడిపెట్టించింది. ప్రమాదంపై కాస్తంత ఆలస్యంగా సమాచారం అందుకున్న పేర్వారం రాములు సతీమణి పరుగు పరుగున మనవలని చూసేందుకు వచ్చారు. అయితే అప్పటికే విగతజీవులుగా మారిన మనవలను చూసి ఆమె తట్టుకోలేకపోయారు. నెత్తీనోరు కొట్టుకుంటూ ఆమె నడిరోడ్డుపైనే విలపించారు. ఆ మృతదేహాలను తడుముతూ ఆమె విలపించిన తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది. సమీప బంధువులు ఓదార్చేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. అక్కడే రోడ్డుపైనే కుప్పకూలిన ఆమె రోదిస్తూనే ఉన్నారు.