: వార్ వన్ సైడైపోయింది!... ‘గులాబీ’ సంబరాలు షురూ!


వరంగల్ ఉప ఎన్నికల్లో నిజంగానే వార్ వన్ సైడైపోయింది. ఈ నెల 21న జరిగిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ వరంగల్ లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో నేటి ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. 8 రౌండ్లు ముగిసేసరికే టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ దాదాపుగా విజయం సాధించేశారు. వరంగల్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లన్నిటిలోనూ టీఆర్ఎస్ ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. టీడీపీకి పట్టున్న వర్ధన్నపేటలోనూ పసునూరికి భారీ ఎత్తున ఓట్లు పోలయ్యాయి. ఇప్పటికే 3.50 లక్షల ఓట్లకు పైగా సాధించిన పసునూరి దయాకర్... తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 2.60 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీని సాధించారు. సర్వేకు కేవలం 75 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీకి దాదాపుగా 50 వేల ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి 6 వేల ఓట్ల లోపే ఉన్నారు. దీనిని బట్టి చూస్తే ఓటింగ్ దాదాపుగా ఏకపక్షంగానే సాగిందని తెలుస్తోంది. విపక్షాలకు దిమ్మదిరిగేలా ఓటర్లు అధికార పార్టీ వైపే మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు మొదలుపెట్టాయి. పోలింగ్ కేంద్రానికి కాస్తంత దూరంగా, నగరంలోని పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ, బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News