: ఏ టూ జెడ్ లో ‘పీ ఎం’ మిస్!... మోదీ విదేశీ పర్యటనపై డిగ్గీ రాజా ట్వీట్!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ నేతలు తమదైన రీతిలో విరుచుకుపడుతున్నారు. నిన్నటికి నిన్న ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ లో చెరకు రైతుల సమస్యలపై భారీ ర్యాలీ నిర్వహించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని విదేశీ పర్యటనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు విదేశాల్లో తిరగండి.. నేను రైతులకు బాసటగా పొలాల్లో తిరుగుతా’’ అని రాహుల్ మోదీపై విరుచుకుపడ్డారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కూడా మోదీ పర్యటనపై ధ్వజమెత్తారు. ఇందుకోసం డిగ్గీరాజా ట్విట్టర్ ను వేదికగా చేసుకున్నారు. ఇంగ్లీష్ అక్షరమాల ‘ఏ టూ జెడ్’ లో ‘పీ ఎం’ అక్షరాలు మిస్సయ్యాయని ఆయన తనదైన శైలిలో ట్వీటారు. సదరు ట్వీట్ లో డిగ్గీరాజా తన విమర్శను చాలా ఆసక్తికరంగా వివరించారు. ఓ టీచర్, విద్యార్థి మధ్య జరిగిన సంభాషణను డిగ్గీరాజా ప్రస్తావించారు. ఇంగ్లీష్ అక్షరమాలలో పీ, ఎం పదాలను విద్యార్థి మరిచిపోతాడు. ఆ పదాలు ఎక్కడికెళ్లాయన్న టీచర్ ప్రశ్నకు స్పందిస్తూ సదరు విద్యార్థి ‘విదేశీ పర్యటనకు..’ వెళ్లాయంటూ సమాధానమిస్తాడు. ఆ సంభాషణ డిగ్గీ రాజా ఎలా చెప్పారంటే... టీచర్: ఏబీసీడీలను ఓసారి చెప్పు విద్యార్థి: ఏ బీ సీ డీ ఈ ఎఫ్ జీ హెచ్ ఐ జే కే ఎల్... ఎన్ ఓ... క్యూ ఆర్ ఎస్ టీ యూ వీ డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ టీచర్: పీ ఎం ఎక్కడికెళ్లాయి? విద్యార్థి: విదేశీ పర్యటనకు...