: చంద్రబాబు మంచి నేత... అయినా పార్టీని వీడాల్సి వస్తోంది: టీ టీడీపీ రాష్ట్ర నేత దొమ్మాటి సాంబయ్య
వరంగల్ ఓట్ల లెక్కింపునకు ఓ రోజు ముందుగా అటు బీజేపీకే కాక ఇటు టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీకి యెన్నం శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయగా, టీడీపీకి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దొమ్మాటి సాంబయ్య గుడ్ బై చెప్పారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ చార్జీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సాంబయ్య ఉప ఎన్నిక కౌంటింగ్ కు ఒక్క రోజు ముందుగా పార్టీ వీడుతున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఈ మేరకు నిన్న వరంగల్ జిల్లా హన్మకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును మంచి నేతగా సాంబయ్య అభివర్ణించారు. చంద్రబాబు మంచి నేతనే అయినప్పటికీ తాను పార్టీని వీడాల్సి వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లాలో అగ్రవర్ణాలకు చెందిన ఓ కీలక నేత వ్యవహార సరళి కారణంగానే తాను పార్టీని వీడుతున్నానని సాంబయ్య ఆరోపించారు. వరంగల్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని స్థానిక నేతలు భావించినా, బీజేపీకి సీటు దక్కేలా చేసి సదరు నేత కోట్ల మేర దండుకున్నారని, దీనికి సంబంధించి త్వరలోనే వివరాలు వెల్లడిస్తానని కూడా ఆయన పేర్కొన్నారు.