: ఇలాంటి జీవో ఎలా జారీ చేస్తారు?: టీ గృహనిర్మాణ శాఖపై హైకోర్టు మండిపాటు


డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక నిమిత్తం గత నెల 15న తెలంగాణ గృహ నిర్మాణ శాఖ జారీ చేసిన జీవోను ఉపసంహరించుకుని కొత్త జీవోను జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మహేందర్ రెడ్డిని హైకోర్టు నీలదీసింది. తెలంగాణ గృహ నిర్మాణ శాఖ జారీ చేసిన ఈ జీవోను సవాల్ చేస్తూ జేసుదాసు అనే వ్యక్తి హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశాడు. దీనిపై హైకోర్టు సోమవారం విచారణ చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోస్లే, జస్టిస్ రవికుమార్ తో కూడిన ధర్మాసనం ఈ జీవోపై పలు వ్యాఖ్యలు చేసింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కమిటీకి అప్పగించకపోవడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ప్రజల నుంచి దరఖాస్తులు ఏ విధంగా స్వీకరిస్తారని ప్రశ్నించింది. కొత్త జీవో ఆధారంగా లబ్ధిదారులను ఖరారు చేయాలని సూచించింది. ఈ నెలాఖరు లోగా ఇందుకు సబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాలని మహేందర్ రెడ్డిని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News