: ఇది అమెరికా సతీ సావిత్రి కథ
యమ దర్మరాజుతో పోరాడి సత్యవంతుడి ప్రాణాలు దక్కించుకున్న సతీ సావిత్రి గురించి ఆమెకు తెలుసో తెలీదో కానీ, ఆమె మాత్రం అమెరికా అభినవ సతీ సావిత్రి అనడంలో అతిశయోక్తి లేదు. అమెరికాకు చెందిన డేనియల్ కి మాట్ డెవిస్ తో వివాహం జరిగిన ఆరు నెలలకు ఘోర ప్రమాదం సంభవించింది. దీంతో మాట్ కోమాలోకి వెళ్లిపోయాడు. అతనిని మామూలు మనిషిని చేసేందుకు ప్రయత్నించిన వైద్యులు 'ఇక మా వల్ల కాదు, ఆక్సిజన్ మాస్క్ తొలగించు, మళ్లీ కొత్త జీవితం ప్రారంభించు' అని సలహా ఇచ్చారు. సరిగ్గా వారి వివాహానికి రెండు నెలల ముందు మాట్ డెవిస్ తండ్రి మృతిచెందారు. అంతకు ముందే మాట్ తల్లి కాలం చేశారు. దీంతో మాట్ కి అన్నీ తనే అయింది. వైద్యుల సలహాను పక్కన పెట్టి ట్యూబులతో భర్తను ఇంటికి తీసుకొచ్చింది. కంటికి రెప్పలా కాపాడింది. సరిగ్గా మూడు నెలలకు మాట్ కళ్లు తెరిచాడు. భార్య మాటలకు స్పందించేవాడు. కానీ ఆమె ఎవరో, ఎందుకు చేస్తోందో తెలిసేది కాదు. ఎందుకంటే మెమరీ పోయింది. అయినప్పటికీ ఆమె తన ధర్మం మరువలేదు. తన భర్తను ఎలాగైనా కాపాడుకుంటానని ఆమె బలంగా నమ్మింది. నెమ్మదిగా ఫిజియో ఎక్సర్ సైజులు చేయించింది. ఆరు నెలలకు మాట్ కు పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో భర్తకు సపర్యలు చేస్తూ, ఫిజియో, యోగా, తేలికపాటి వ్యాయామాలు చేయించింది. దీంతో మాట్ మళ్లీ ఆరోగ్యవంతుడయ్యాడు.