: లాలూనే లాక్కుని, కౌగిలించుకున్నాడు: కేజ్రీవాల్
ఒకరేమో అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తుతూ, మచ్చలేని నేతగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. మరొకరేమో అవినీతి బురదనంతా ఒంటికి అంటించుకుని, నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. ఏ రకంగా చూసినా వీరిద్దరికీ ఒక్క పోలిక కూడా లేదు. ఈ క్రమంలో, గత శుక్రవారం బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేసినప్పుడు జరిగిన ఓ ఘటన పతాక శీర్షికలకు ఎక్కింది. అదే... లాలూ, కేజ్రీవాల్ ల ఆలింగనం. స్టేజ్ మీద వీరిద్దరూ కౌగిలించుకున్న ఫొటోలు సంచలనం రేపాయి. లూలూను కేజ్రీవాల్ కౌగిలించుకోవడమేంటని... నెటిజన్లు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కౌగిలింతకు సంబంధించి కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు. స్టేజ్ మీదకు వెళ్లిన తనకు లాలూ షేక్ హ్యాండ్ ఇచ్చారని, వెంటనే తనవైపు లాక్కొని కౌగిలించుకున్నారని, ఆ తర్వాత తన చేతిని పట్టుకుని గాల్లోకి లేపారని చెప్పారు. ఇందులో తాను చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. అవినీతిపై తమ పోరాటం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. లాలూతో తమకు ఎలాంటి రాజకీయ పొత్తులు లేవని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ఘన విజయాన్ని సాధించిన నితీశ్ కుమార్ కోసమే తాను ప్రమాణస్వీకారానికి వెళ్లానని కేజ్రీవాల్ చెప్పారు. నితీశ్ మంచి వ్యక్తి అని... ఇదే విషయాన్ని బీహార్ ప్రజలు కూడా తమకు చెప్పారని వెల్లడించారు.