: అరెస్టును తప్పించుకునేందుకు బ్యాంకులతో కాళ్లబేరానికి దిగిన లిక్కర్ కింగ్ మాల్యా!


ఒకప్పుడు భారత మద్యం వ్యాపారంలో తిరుగులేని వ్యాపారాధిపతిగా, ప్రైవేటు ఎయిర్ లైన్స్ విభాగంలో ప్రధాన సంస్థకు అధిపతిగా ఉండి, ఆపై చేజేతులా చేసిన తప్పులతో దివాలా తీసి బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు బాకాయిలు పడ్డ విజయ్ మాల్యా, ఇప్పుడు వాటిని ఎలాగైనా తీర్చి జైలు జీవితాన్ని తప్పించుకోవాలని చూస్తున్నాడు. ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ. 950 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రంగ ప్రవేశం చేయడంతో, విచారణ జరిగితే, తాను జైలుకు వెళ్లడం ఖాయమని భావిస్తున్న మాల్యా ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం తన పేరిట దేశ విదేశాల్లో ఉన్న ఆస్తులను, యూబీ గ్రూప్, యునైటెడ్ స్పిరిట్స్, మంగళూరు కెమికల్స్ తదితర కంపెనీల్లో ఉన్న ఈక్విటీ వాటాలను విక్రయించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా బ్యాంకులతో చర్చించి తాను కట్టాల్సిన మొత్తాలను సెటిల్ చేసుకునేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించనున్నారని సమాచారం. కాగా, ప్రస్తుతం పలు భారత బ్యాంకులకు మాల్యా దాదాపు రూ. 7 వేల కోట్ల వరకూ రుణాలను చెల్లించాల్సి వుంది. ఇదే సమయంలో యునైటెడ్ స్పిరిట్స్ లో మాల్యాకు ఉన్న నాలుగు శాతం వాటాను విక్రయిస్తే, రూ. 2,200 కోట్లు లభిస్తాయి. ఇక యునైటెడ్ బ్రీవరీస్ లో ఆయనకున్న 32.62 శాతం వాటాలను విక్రయిస్తే, రూ. 8,500 కోట్లు లభిస్తాయి. వీటికి అదనంగా యునైటెడ్ బ్రీవరీస్ లో రూ. 4,411 కోట్ల విలువైన వాటాలు మాల్యాకు ఉన్నాయి. వీటిని విక్రయించడం ద్వారా మాల్యా సులువుగానే బయటపడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఎటొచ్చీ ఈ వాటాల్లో కొంత భాగం బ్యాంకుల వద్ద తాకట్టు రూపంలో ఉండటమే కొన్ని అవరోధాలను కలిగించవచ్చని తెలుస్తోంది. ఇదిలావుండగా, గత నెలలో గోవా, బెంగళూరు ప్రాంతాల్లోని యూబీ గ్రూప్ కార్యాలయాలు, మాల్యా నివాసంపై దాడులు జరిపిన తరువాత సీబీఐ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ మాల్యాకు వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన పలు బ్యాంకులను ఉద్దేశపూర్వకంగా మోసం చేసినట్టు ప్రాథమిక సాక్ష్యాలున్నాయని సీబీఐ ఈ ఎఫ్ఐఆర్ లో అభిప్రాయపడింది. దీంతో సాద్యమైనంత త్వరగా బ్యాంకులతో చర్చించి, పాత రుణాలను తిరిగి చెల్లించానని అనిపించుకునేందుకు మాల్యా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మధ్యేమార్గంగా వన్ టైం సెటిల్ మెంట్ చేసుకోవాలన్నది ఆయన అభిమతంలా తెలుస్తోంది. తీసుకున్న రుణం, దానికి వడ్డీలను కలిపి, చెల్లించాల్సిన మొత్తం స్థానంలో, వడ్డీపై రాయితీలను కోరాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో వేగంగా కదలకుంటే, సీబీఐ అరెస్టును మాల్యా ఫేస్ చేయక తప్పదు.

  • Loading...

More Telugu News