: రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక కోసమే తొలి అడుగు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ బీజేపీకి రాజీనామా చేసిన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యెన్నం శ్రీనివాస్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. బీజేపీని వీడుతున్న తనకు వేరే పార్టీలో చేరే ఉద్దేశం లేదని తెలిపారు. ఈ మేరకు మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తానింకా తెలంగాణ బచావో మిషన్ లోనే ఉన్నానని చెప్పారు. ఉద్యోగం మానేసి ఉద్యమంలో చేరానన్నారు. తెలంగాణ గమ్యాలు, లక్ష్యాలు దూరమవుతున్నాయన్న ఆయన, ఉద్యమకారులను ఇప్పటివరకు సత్కరించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేసేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ప్రత్యామ్నాయం కాలేకపోతున్నాయని, రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక కోసమే తొలి అడుగు వేస్తున్నట్టు యెన్నం పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. బడుగుల తెలంగాణ కోసం కృషి చేస్తామని వివరించారు.