: గుంటూరులో అల్ ఖైదా నకిలీ తీవ్రవాది నవీన్ అరెస్టు!
తాను అల్ ఖైదా తీవ్రవాదినంటూ డబ్బులు డిమాండ్ చేసిన ఒక నకిలీ తీవ్రవాదిని గుంటూరులో అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపి వివరాలు... గుంటూరులోని స్థానిక కృష్ణబాబు కాలనీకి చెందిన దోనెపూడి నవీన్ అనే యువకుడు, ఈ నెల 21వ తేదీన గుంటూరు మస్తాన్ దర్గా చైర్మన్ రామ్మోహన్ రావు కు ఫోన్ చేసి, తాను అల్ ఖైదా ఉగ్రవాదినని, తనకు రూ.3 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. తాను అడిగిన డబ్బు ఇవ్వకపోతే దర్గాను పేల్చిపారేస్తానంటూ బెదరించాడు. రామ్మోహన్ రావు ఈ విషయాన్ని నగరం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ తీవ్రవాదిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా గుంటూరు అర్బన్ ఎస్పీ త్రిపాఠి, ఏఎస్పీ అప్పలనాయుడు మాట్లాడుతూ, ఈ కేసు విషయమై ప్రత్యేక దర్యాప్తు చేపట్టామన్నారు. నవీన్ అనే యువకుడు నిందితుడిగా తేలిందని స్థానిక చుట్టుగుంట సెంటర్ వద్ద అతన్ని అరెస్టు చేశామని చెప్పారు.