: రాత్రింబవళ్లు రోడ్ల మీదే మంత్రి నారాయణ.. నెల్లూరు దురాక్రమణలపై కఠిన చర్యలు తప్పవని ప్రతిన
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా వెల్లువెత్తిన తుపాను నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేసింది. జిల్లాలోని మెజారిటీ ప్రాంతాలు నీట మునిగాయి. నెల్లూరు జిల్లా మీదుగా వెళుతున్న కోల్ కతా-చెన్నై జాతీయ రహదారి పలుచోట్ల వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ప్రస్తుతం మూడు రోజుల క్రితం వర్షం తగ్గుముఖం పట్టడంతో రహదారికి మరమ్మతులు ఇప్పుడిప్పుడే పూర్తయ్యాయి. తుపాను ప్రభావం కారణంగా నెల్లూరు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో నగరవాసులు రోజుల తరబడి ఇక్కట్లపాలయ్యారు. ఈ తరహా దుస్థితికి నగరంలో భూ దురాక్రమణలే కారణమని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఓ అంచనాకు వచ్చారు. నెల్లూరు వాస్తవ్యుడైన నారాయణ నిన్న రాత్రి నుంచే రోడ్డపైకి వచ్చేశారు. నిన్న రాత్రి పొద్దుపోయే దాకా నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన నేటి ఉదయం తెల్లవారకముందే మళ్లీ రంగంలోకి దిగారు. నెల్లూరు నగరాన్ని జలసంద్రంగా మార్చిన భూబకాసురులపై ఇకపై ఉక్కుపాదం మోపనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతమున్న భూ దురాక్రమణలను రద్దు చేయని కారణంగా మరోసారి తుపాను వస్తే నెల్లూరు నగరమే కొట్టుకుపోతుందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.