: నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మళ్లీ వర్షం... రోడ్డుమార్గాన శ్రీకాళహస్తికి చంద్రబాబు పయనం
బంగాళాఖాతంలో ఏర్పడ అల్పపీడనం కారణంగా వెల్లువెత్తిన తుపాను నెల్లూరు, చిత్తూరు జిల్లాలను అతలాకుతలం చేసింది. మూడు రోజుల క్రితం వర్షం తగ్గుముఖం పట్టగా నిన్న మధ్యాహ్నం నుంచి నీట మునిగిన ప్రాంతాలన్నీ చిన్నగా కోలుకుంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో పునరావాస చర్యలు ఊపందుకున్నాయి. తాజాగా నేటి ఉదయం మరోమారు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఇప్పటికే రెండు రోజుల పాటు నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు చిత్తూరు, కడప జిల్లాలకు వెళ్లాల్సి ఉంది. అయితే నేటి ఉదయం మొదలైన వర్షం కారణంగా హెలికాప్టర్ ను నెల్లూరులోనే వదిలేసిన ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తికి రోడ్డు మార్గం మీదుగా బయలుదేరారు. శ్రీకాళహస్తి పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన తర్వాత ఆయన వర్ష బీభత్సంపై అధికారులతో సమీక్షిస్తారు.