: టర్కీ విమానానికి బాంబు బెదిరింపు... హాలీఫ్యాక్స్ లో క్షేమంగా ల్యాండైన విమానం
ఐఎస్ ఉగ్రవాదుల దాడుల పరంపర నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వందలాది మంది ప్రయాణికులతో నింగికెగసే విమానాలను టార్గెట్ చేస్తున్న ఉగ్రవాదులు ఆయా దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం అమెరికా నుంచి టర్కీ బయలుదేరిన విమానానికి బాంబు బెదిరింపులు ఎదురయ్యాయి. అమెరికాలోని న్యూయార్క్ నుంచి 256 మంది ప్రయాణికులతో టర్కీకి బయలుదేరిన విమానంలో బాంబు పెట్టామని ఉగ్రవాదుల నుంచి హెచ్చరికలు వచ్చాయి. దీంతో వేగంగా స్పందించిన విమానయాన శాఖాధికారులు సదరు విమానం దారి మళ్లించి కెనడాలోని హాలీఫ్యాక్స్ విమానాశ్రయంలో సురక్షితంగా కిందకు దించారు. దీంతో మొత్తం 256 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.