: ఇక లోకేశ్ వంతు!.. బెజవాడలో గెస్ట్ హౌస్ లోకి ఎంటరైన టీడీపీ యువనేత
ఏపీలోని ప్రముఖులు బెజవాడకు క్యూ కడుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తరచూ తలెత్తుతున్న వివాదాలు, ప్రభుత్వ పాలన, నూతన రాజధానికి సమీపంగా ఉండాలనే భావనలు... వారిని బెజవాడ బాట పట్టిస్తున్నాయి. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇప్పటికే తన మకాంను పూర్తిగా విజయవాడకు మార్చేశారు. విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న ఆయన అక్కడికి సమీపంలోనే కృష్ణా కరకట్టలపై అధునాతన హంగులతో రూపొందిన లింగమనేని హౌస్ ను రెస్ట్ హౌస్ గా మార్చుకున్నారు. తాజాగా ఆయన కుమారుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా విజయవాడలో తన మకాంను ఏర్పాటు చేసుకున్నారు. తండ్రి చంద్రబాబు రెస్ట్ హౌస్ కు కూతవేటు దూరంలో కృష్ణా కరకట్టలపైనే నారా లోకేశ్ కొత్త గెస్ట్ హౌస్ ను ఏర్పాటు చేసుకున్నారు. నిన్న మంచిరోజు కావడంతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన లోకేశ్ కుటుంబం అందులోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. కట్టుదిట్టమైన భద్రత ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ లో చంద్రబాబును కలిసేందుకు కుదరని టీడీపీ నేతలు ఇకపై నేరుగా నారా లోకేశ్ వద్దకు వెళ్లే అవకాశముంది. ఈ తరహా వెసులుబాటు కోసమే లోకేశ్ తన తండ్రి రెస్ట్ హౌస్ కు సమీపంలో గెస్ట్ హౌస్ తీసుకున్నారట. అంతేకాక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత విజయవాడ పర్యటనలు మరింత మేర పెరిగిన నేపథ్యంలోనూ అక్కడ ఆయనకు గెస్ట్ హౌస్ అవసరం ఏర్పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.