: గంగిరెడ్డిని ఎన్ కౌంటర్ చేస్తారేమోనని భయపడుతున్నాం: గంగిరెడ్డి భార్య మాళవిక
ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని మారిషస్ నుంచి ఏపీకి తీసుకొచ్చిన కొన్ని రోజుల తరువాత ఆయన భార్య మాళవిక మీడియా ముందుకొచ్చింది. హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడింది. తన భర్త దుబాయ్ వెళ్లాడని, ఎక్కడికీ పారిపోలేదని చెప్పింది. అయితే సీఎం చంద్రబాబు వల్ల తమకు ప్రాణహాని ఉందని గవర్నర్ కు లేఖ ఇచ్చామని, ఆ తరువాత గంగిరెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది. కోర్టు విధించే శిక్షకు తన భర్త భయపడడని అంటోంది. గంగిరెడ్డిని కోర్టు వాయిదాలకు తీసుకువెళ్లే సమయంలో కానీ, జైల్లో కానీ ఎన్ కౌంటర్ చేస్తారేమోనని తాము భయపడుతున్నామని ఆందోళన వ్యక్తం చేసింది. తన భర్తకు ఏం జరిగినా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పింది. కోర్టులపై తమకు నమ్మకం ఉందని, కచ్చితంగా న్యాయ చేస్తారని విశ్వసిస్తున్నామని మాళవిక తెలిపింది.