: అమ్మవారి పల్లకి మోసిన మెగాస్టార్ చిరంజీవి!


హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భార్య సురేఖతో కలిసి చిరంజీవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ, ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కార్తీక దీపారాధనలు, ఇక్కడ జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను చూస్తుంటే ఒక దివ్యానుభూతి కలుగుతోందన్నారు. పవిత్రమైన కార్తీక మాసంలో భక్తి ప్రపత్తులతో పూజలు చేస్తున్న ప్రతిఒక్కరికీ దైవాశీస్సులు ఉంటాయన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. చిన్నప్పటి నుంచి కూడా కార్తీక మాసంతో తనకు విడదీయరాని బంధం ఉందన్నారు. తమ కుటుంబసభ్యులు, చిన్నమ్మలు, బంధువులు చాలా భక్తితో కార్తీకమాసంలో పూజలు చేసేవారన్నారు. విశిష్ట అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి దంపతులు అక్కడ జరిగిన ప్రతి కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు. హంసవాహనంపై గౌరీదేవిని ఊరేగించిన కార్యక్రమంలో భక్తులతో కలిసి చిరంజీవి పల్లకీ మోశారు. కాగా, కోటి దీపోత్సవ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News