: రంగంలోకి పోలీసు బాసులు... మేయర్ దంపతుల మర్డర్ స్పాట్ పై నిశిత పరిశీలన
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో పోలీసు బాసులు రంగంలోకి దిగారు. రాయలసీమ అదనపు డీజీ ఆర్పీ ఠాకూర్, కర్నూలు రేంజీ ఐజీ వేణుగోపాలకృష్ణ, అనంపురం రేంజీ డీఐజీ సత్యనారాయణ తదితరులు నిన్న రాత్రే చిత్తూరుకు చేరుకున్నారు. నేటి ఉదయమే రంగంలోకి దిగిన వారు కేసు దర్యాప్తుపై దృష్టి సారించారు. ముగ్గురు ఉన్నతాధికారులు కలిసి ఘటన జరిగిన చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాక ఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్న కార్పొరేటర్లు, ఆయా పార్టీల నేతలు, కఠారి అనుచరులను కూడా వారు విచారించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకేసారి ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు చిత్తూరు రావడంతో చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను ఆయన పోలీసు బాసుల ముందు పెట్టారు.