: ‘సత్యభామ’ వర్శిటీ ర్యాగింగ్ కు తెలుగు విద్యార్థి బలి!
ర్యాగింగ్ భూతానికి మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. తమిళనాడులోని ప్రతిష్ఠాత్మక సత్యభామ విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న తెలుగు విద్యార్థి వెంకటకృష్ణ నిన్న రాత్రి హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకెళితే... హైదరాబాదులోని కూకట్ పల్లికి చెందిన వెంకటకృష్ణ తమిళనాడు రాజధాని చెన్నైలోని సత్యభామ వర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలలో చేరాడు. ప్రస్తుతం సెకండియర్ చదువుతున్న వెంకటకృష్ణపై అక్కడ సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. ర్యాగింగ్ లో భాగంగా అక్కడి సీనియర్లు వెంకటకృష్ణను తీవ్రంగా వేధించారు. డబ్బులు లాక్కోవడంతో పాటు భౌతిక దాడులకు దిగారు. ఈ క్రమంలో గతంలోనే తీవ్ర గాయాలపాలైన వెంకటకృష్ణ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా దాచేశాడు. ఇటీవల సీనియర్ల వేధింపులు మరింత అధికం కావడంతో మనస్తాపానికి గురైన వెంకటకృష్ణ ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. దీపావళి సెలవుల కోసం తల్లిదండ్రుల వద్దకు వచ్చిన అతడు పండుగను సంతోషంగానే జరుపుకున్నాడు. నిన్న సాయంత్రం కళాశాలలో తాను ఎదుర్కొన్న వేధింపులను 8 పేజీల సూసైడ్ నోట్ లో రాసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో షాక్ కు గురైన వెంకటకృష్ణ తల్లిదండ్రులు సూసైడ్ నోట్ చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. సూసైడ్ నోట్ ను పోలీసులకు అందజేసిన అతడి తల్లిదండ్రులు ర్యాగింగ్ కు పాల్పడ్డ సీనియర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.