: విశాఖకు తక్షణం కావాల్సినవి విపత్తు నిర్వహణ చర్యలే!: వెంకయ్యనాయుడు
విశాఖపట్టణానికి తక్షణం కావాల్సినవి విపత్తు నిర్వహణ చర్యలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. విశాఖపట్టణంలో నిర్వహించిన ప్రపంచ విపత్తు కాంగ్రెస్ లో ఆయన మాట్లాడుతూ, విశాఖను విపత్తులు చుట్టుముడుతున్నాయని అన్నారు. వాటి నుంచి రక్షణ పొందాలంటే పటిష్ఠమైన కట్టడాలు అవసరమని అన్నారు. విశాఖకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కావాలని, అలాగే భూగర్భ కేబుల్ వ్యవస్థ కావాలని పేర్కొన్నారు. సెల్ టవర్లు కూడా 250 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునేలా నిర్మించాలని ఆయన సూచించారు. బిల్డర్లు ఏమాత్రం అలసత్వం చూపినా మొదటికే మొసం వస్తుందని ఆయన తెలిపారు. నిర్దేశిత ప్రమాణాలు పాటించకుండా ఇల్లు నిర్మిస్తే పెను ప్రమాదాలు తప్పవని ఆయన హెచ్చరించారు. విపత్తు వచ్చిన తరువాత నెత్తీనోరు బాదుకునే కంటే ముందుగానే మేల్కోవాలని ఆయన సూచించారు. విశాఖను సరికొత్తగా అభివృద్ధి చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.