: లాలూ తనయుడికే 'డిప్యూటీ' పగ్గాలు?


బీహార్ లో విజయం సాధించిన మహాకూటమి అధికారం చేపట్టేందుకు సిద్ధమవుతుండగా, మరో సందేహం అందర్లోనూ నెలకొంది. నితీశ్ కుమార్ తన కేబినెట్ లో లాలూ పార్టీ ఆర్జేడీకి పెద్ద పీట వేయనున్నారని విశ్లేషకులు అంచనాలు కడుతుండగా... మరోపక్క లాలూ కుమారుడికి ఏకంగా డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి. తొమ్మిదో తరగతి వరకు చదివిన తేజస్వీ యాదవ్, క్రికెటర్ గా రాణించాలని భావించారు. అయితే ప్రతిభ కొరవడడంతో జాతీయ జట్టుకు ఆడలేకపోయారు. దీంతో ఆయన బీహార్ రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. తాజా ఎన్నికల్లో విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తానంటూ బరిలో దిగి విజయం సాధించారు. తమ పార్టీ అఖండ మెజారిటీ సాధించడంతో డిప్యూటీ సీఎం పీఠం ఆయనకు దక్కేలా లాలూ ప్రణాళికలు రచించారని, ఆయనే డిప్యూటీ సీఎం అని ఊహాగానాలు వినపడుతున్నాయి. రాజకీయ అనుభవం లేని తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎం గా రాణించగలడా? అనే అనుమానం అందర్లోనూ నెలకొన్నప్పటికీ, మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడి కుమారుడు అనే అర్హతలు డిప్యూటీ సీఎం పీఠంపై కూర్చునేందుకు సరిపోతాయని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సస్పెన్స్ కి రేపు తెరపడనుంది.

  • Loading...

More Telugu News