: సకలజనుల సమ్మెకు వెన్నుపోటు పొడిచిందెవరు?: కేసీఆర్ కు కిషన్ రెడ్డి ప్రశ్న
టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కిషన్ రెడ్డి ఉన్నారా? అని కేసీఆర్ ప్రశ్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఉద్యమం నుంచి తాను పారిపోలేదని చెప్పారు. ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఎంత? అని ప్రశ్నించారు. ఉద్యమం తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న సమయంలో సకల జనుల సమ్మెకు వెన్నుపోటు పొడిచింది ఎవరు? అని కేసీఆర్ ను నిలదీశారు. సాగరహారంలో కేసీఆర్ పాల్గొన్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన వారి కుటుంబాలను విస్మరించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని మండిపడ్డారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక... కేసీఆర్ ఎదురు దాడి చేస్తున్నారని అన్నారు. కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన నిధులను కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పరాజయం పాలుకావడం ఖాయమని చెప్పారు.