: భారత్ లో ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సేకరిస్తున్న హిజ్బుల్ ముజాహిద్దీన్


పాకిస్థాన్ కు చెందిన హిజ్బుల్ ముజాహిద్దీన్ (హెచ్ఎం) భారీ ఎత్తున నిధులు సేకరిస్తోందని భారత దర్యాప్తు అధికారులు తెలిపారు. గత ఎనిమిది సంవత్సరాల్లో పాక్ లోని వివిధ వర్గాల నుంచి రూ.80 కోట్లకు పైగానే వసూలు చేసిందని చెప్పారు. ప్రధానంగా భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను మరింత విస్తరించేందుకే హెచ్ఎం ఈ విరాళాలను సమకూరుస్తున్నట్టు పారిస్ లోని అంతర్జాతీయ సంస్థ 'ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్'కు సమర్పించిన నివేదికలో వెల్లడించారు. పారిస్ దాడుల నేపథ్యంలో ఉగ్రవాద గ్రూపులకు నిధులు ఎలా అందుతున్నాయి, వాటిని ఎలా ఆపాలి? అన్న అంశాలపై టాస్క్ ఫోర్స్ సభ్య దేశాలు చర్చించాయి. ఈ నేపథ్యంలో పారిస్ తరహాలో గతంలో జరిగిన ముంబై దాడులను భారత్ ప్రస్తావించింది. పాక్ లోని ఉగ్రవాద సంస్థలు ఇష్టారాజ్యంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విధానాన్ని సభ్య దేశాల దృష్టికి తీసుకొచ్చింది. వారు సేకరించే నిధులు భారత్ కు చేరగానే వివిధ మార్గాల ద్వారా మళ్లించి క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాదులు, మరణించిన హిజ్బుల్ ఉగ్రవాదుల కుటుంబ సభ్యులకు కూడా అందజేస్తారని పై నివేదికలో భారత అధికారులు పేర్కొన్నారు. అంతేగాక విదేశాల్లో కూడా నిధులు సేకరించి తమ ముసుగు సంస్థలకు ఆ సొమ్మును చేరవేస్తున్నారని వెల్లడించారు.

  • Loading...

More Telugu News